కమ్మనైనది అమ్మభాష

 మనషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరు అని చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష ప్రతి ఒక్కరికీ సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా మాతృభాష వస్తుంది. అమ్మ మాటే మాతృభాష అవుతుంది. అందుకే ప్రతి బిడ్డను అమ్మ కాపాడుకున్నట్లు మాతృభాషను కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తించేందుకే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్స వాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహిస్తున్నారు. యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999లో నవంబర్‌ 17న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. అందులో భాగంగా 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాష సంస్కృతిక వైవిద్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో భావించి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఒక్కరూ మాతృభాషను కాపాడుకుంటూనే తక్కిన భాషలన్నింటినీ నేర్చుకొని అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం.