నమస్తే భారత్‌

‘భారతదేశం స్వేచ్ఛకు, హక్కులకు, చట్టాలకు గౌరవం ఇస్తుంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, యూదులు సామరస్యంగా తమ సంప్రదాయాలను పాటిస్తుంటారు. అందుకే భారత్‌ను ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నది’ అంటూ అగ్రరాజ్యాధీశుడు డొనాల్డ్‌ట్రంప్‌.. అహ్మదాబాద్‌ వేదికగా లక్షమందికిపైగా జనం సమక్షంలో చాటిచెప్పారు. ఉగ్రవాదానికి రెండు దేశాలూ నష్టపోయాయని ప్రస్తావిస్తూ.. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై అమెరికా-భారత్‌ ఉక్కుసంకల్పంతో పోరాడుతాయని స్పష్టంచేశారు. సోమవారం భారత పర్యటనను ప్రారంభించిన ట్రంప్‌కు అహ్మదాబాద్‌లో అఖండ స్వాగతం లభించింది. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతెరా స్టేడియంలో మోదీ, ట్రంప్‌ లక్షమందికిపైగా జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం భారత్‌ సాధించిన అభివృద్ధి అపూర్వమని ట్రంప్‌ కొనియాడారు. ట్రంప్‌ రాక ఇరుదేశాల సంబంధాల్లో కొత్త చరిత్రను లిఖించిందని మోదీ చెప్పారు. అనంతరం ట్రంప్‌ కుటుంబం తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీ చేరుకొన్నది. మంగళవారం మోదీ, ట్రంప్‌ హైదరాబాద్‌హౌస్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 300 కోట్ల డాలర్ల విలువైన ఆధునిక సైనిక హెలికాప్టర్లు, సైనిక సామగ్రిని భారత్‌కు అమెరికా అందజేసే ఒప్పందంపై సంతకాలు జరుగనున్నాయి.