25వేల లోపు రుణాలు నెలా ఖరులోగా మాఫీ

రైతు రుణమాఫీకి సంబంధించి ముందుగా రూ.25వేలలోపు వారికి ఈ నెలాఖరులోగా చెక్కులు అందజేయనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ద్వారా ఈ చెక్కులను పంపిణీచేస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కమిటీహాల్‌లో ఆయన ‘సామాజిక, ఆర్థిక సర్వే - 2020’ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రూ.25వేలలోపు రుణమాఫీకి అర్హులైన రైతులు 5.86 లక్షలమంది ఉన్నారని చెప్పారు. రుణమాఫీపై ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మిగిలిన రుణమాఫీని నాలుగు విడుతలుగా చెక్కులు అందజేస్తామని చెప్పా రు.